వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు.. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా 'తిప్పరా మీసం' ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లో శ్రీవిష్ణు నెగటివ్ షెడ్స్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో శ్రీవిష్ణు 'తిప్పరా మీసం' అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించాడా? మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? తెలుసుకుందాం పదండి..
మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్ సెంటర్‌లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతని.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏదీఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది సినిమాలో చూడాలి.